
ఏపీజీబీ ప్రధాన కార్యాలయం కడప లోనే కొనసాగించాలి
పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున, కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయన్ని అక్కడే కొనసాగించాలని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి ద్వారా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారిని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ కడప ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఏపీజీబీ మిగతా గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే అతి పెద్దది కావడం, గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సొంత భవనం కలిగి ఉండడం, దక్షిణ భారత దేశంలో ఏ గ్రామీణ బ్యాంకు కు లేనటువంటి కరెన్సీ చెస్ట్ సౌకర్యం కలిగి ఉండడంతో పాటు అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉండడం వలన ప్రతిపాదిత గ్రామీణ బ్యాంకు కడప లోనే కొనసాగించడం అత్యంత ఆవశ్యకమని కోరడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యాలయాలు అమరావతిలో కేంద్రీకరించాలని భావిస్తున్న నేపథ్యంలో, నూతనంగా ఏర్పడబోతున్న, ఈ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా, కడప నుండి అమరావతికి తరలిపోతుందన్న ఆందోళన, ఏపీజీబీ సిబ్బందితో పాటు, మన ప్రాంత ప్రజల్లో కూడా వుంది. అత్యంత కరువు ప్రాంతాల్లో, వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇవ్వడంలో, కీలకపాత్ర పోషిస్తున్న గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలిపోవడమనేది, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం తప్పక చూపుతుంది. మిగతా ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే, వెనుకబడిన రాయలసీమలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలయములు కానీ సంస్థ యొక్క కార్యాలయాలు లేకపోవడం, మిగతా ప్రాంతంలో అనేక కార్యాలయాలు కలిగి ఉండడమనే అంశాల్ని పరిగణలోకి తీసుకొని. నూతనంగా ఏర్పడబోయే గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని పత్తికొండ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష కొన్ని చోట్ల ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తాయి కాబట్టి, ఈ అంశం పట్ల దృష్టి సారించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, కడప నుండి ప్రధాన కార్యాలయం తరలి వెళ్లకుండా చూడగలరని ఆర్డీఓ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, రవి తదితరులు పాల్గొన్నారు.