ఏపీకి జీవనాడి పోలవరం : సీఎం చంద్రబాబు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి, వెన్నముక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చ సందర్భంగా మంగళవారం శాసన సభలో సీఎం మాట్లాడారు. విభజన చట్టం పోలవరం ఎత్తు 45.72 అడుగులు ఉండాలని స్పష్టంగా పేర్కొందని వివరించారు. అదే ఎత్తుకు ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
పోలవరంపై కొందరు ప్రతిరోజూ దురుద్దేశకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు అని గుర్తు చేశారు. ప్రాజెక్టును రూ. 55 వేల కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు. నిర్దిష్ట సమయంలో పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల ఖర్చుకు 12,157 కోట్లు మంజూరు చేశారని, వీటిలో ఇప్పటికే రూ. 2,900 కోట్లు డబ్బులు వచ్చాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 350 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశముంద న్నారు. కుడికాలువ ద్వారా 3.20 లక్షల ఎకరాలకు . ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుందని, మొత్తం 24 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచన రాష్ట్రానికి శాపంగా మారిందని అన్నారు. గత టీడీపీ పాలనలో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేస్తే గత వైసీపీ ప్రభుత్వం 3.84 శాతం మాత్రమే పూర్తి చేసిందన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి, వెన్నెముక, అమరావతి, పోలవరం ఏపికి రెండు కళ్లు లాంటివని పేర్కొన్నారు.