కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం

కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం

స్వయం సహాయక సంఘాల మహిళలు కోటీశ్వరులు కావాలి

బాల్యవివాహాలను అరికట్టడంలో మహిళలు బాధ్యత తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు;  కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం నగరం లోని ఎమ్ఆర్సీ కన్వెన్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం సాధించడమే మహిళలు సాధించిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు..మహిళల పట్ల లింగ వివక్ష, ఓటు హక్కు, చదువుకునే అవకాశం లేని పరిస్థితులను అధిగమించి నేడు ఈ స్థానానికి ఎదగడం అంటే ఇదంతా మహిళలు ప్రపంచ వ్యాప్తంగా చేసిన పోరాటమేనని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో, జిల్లాలో పొదుపు ఉద్యమం వల్ల మహిళల్లో చైతన్యం వెల్లివిరిసిందని కలెక్టర్ పేర్కొన్నారు..నేడు పొదుపు సంఘాల వద్ద ఉన్న డిపాజిట్ లు కలిపితే ఒక బ్యాంక్ సరిపోదని కలెక్టర్ ప్రశంసించారు. ప్రత్యేకంగా కర్నూలు జిల్లా లో పొదుపు ఉద్యమాన్ని చారిత్రక అంశంగా అభివర్ణిస్తూ, జిల్లాలో పొదుపు మహిళలు అద్భుత విజయాలు సాధించారని, వారు సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కలెక్టర్ పేర్కొన్నారు..సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా మహిళ పాత్ర చాలా విశిష్టమైనదని కలెక్టర్ తెలిపారు.. పిల్లల్ని పెంచడం, విద్యాబుద్ధులు నేర్పించడం, వారిని ప్రయోజకులుగా చేయడంలో తండ్రి బాధ్యత కంటే తల్లి బాధ్యత ఎక్కువని కలెక్టర్ ప్రశంసించారు.జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టే బాధ్యతలో మహిళలు తగిన సహకారం అందించాలని కలెక్టర్ కోరారు..జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని కలెక్టర్ తెలుపుతూ, మీ గ్రామాలలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే ఐసిడిఎస్ పిడి కి సమాచారం ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ మహిళలకు తెలిపారు…
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా మహిళలకు చేయూత అందించడం జరుగుతోందన్నారు..ఇందులో భాగంగా సెర్ప్ నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా రూ. 100 కోట్లు, మెప్మా నుండి రూ.34 కోట్లు అందించడం జరుగుతోందని, నిన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎమ్ఎస్ఎంఈ ప్రోగ్రాం కింద రూ. 55 కోట్ల రుణాలను అందించడం జరిగిందన్నారు.. స్వయం సహాయక సంఘాల మహిళలు గతంలో లక్షాధికారి కావాలన్న లక్ష్యంతో పని చేసే వారని, ఇప్పుడు ఆ లక్ష్యం కోటీశ్వరురాలు గా ఎదిగేలా ఉండాలన్నారు.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని, అయితే వీటికి తగిన మార్కెటింగ్ లేదన్నది తన అభిప్రాయం అన్నారు.. ఇందుకు సంబంధించి ONDC (open network for digital commerce)ప్లాట్ ఫాం ను వినియోగించుకుని స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఫోటో లేదా వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లయితే ఉత్పత్తుల ఆర్డర్లను ఎక్కువగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.. దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్ తో కూడా ప్రభుత్వం టై అప్ అవుతోందని, ONDC లో వెంటనే స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎన్రోల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు…తద్వారా భవిష్యత్తు లో ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.ఈరోజు ONDC కింద దాదాపుగా 6000 మందిని ఎన్రోల్ చేయడం జరిగిందన్నారు.. ఎంఎస్ఎమ్ఈ ల కింద మహిళలకు ఈరోజు దాదాపు రూ. 13.27 కోట్ల రుణాలు, ర్యాపిడో ప్రోగ్రాం కింద ఎలెక్ట్రిక్ స్కూటీ లను 25 మంది సభ్యులకు ఇవ్వడం జరిగిందన్నారు.. అదే విధంగా బీసీ కార్పొరేషన్ నుండి 50 మందికి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు…ఈ అవకాశాలను అన్నిటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.కుట్టు శిక్షణ కార్యక్రమం పూర్తిచేసుకున్న వారికి కర్నూలు ఎంపీ ఎంపీ ల్యాడ్ కింద 60 కుట్టు మెషీన్ లను అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు..
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి వర్యులు టి.జి. భరత్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయంతో కాన్ఫేడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైన్యర్స్, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నుండి డివిజన్ కి 200 మంది చొప్పున 600 మందికి మిల్లెట్ బేకింగ్ మీద శిక్షణను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు.. మహిళలందరూ ఈ అవకాశాలను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుని ఆర్థిక, సామాజిక అభివృద్ది సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు..కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదని మహిళలు, అటు పుట్టినింటిలోనూ, ఇటు మెట్టినింటి లోనూ బరువు బాధ్యతలు మోస్తూ అమోఘమైన పాత్ర పోషిస్తారన్నారు. ప్రతి మగవాడి వెనుక ఒక మహిళ ఉంటుందనేది ఒక నగ్న సత్యం అన్నారు. ఇందుకు తానే ఒక సాక్ష్యం అని, తన భాగస్వామి సహకారంతోనే చిరుద్యోగి స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నానని ఎంపీ తెలిపారు.. జిల్లా లో పరిపాలనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, పోలీస్, తదితర డిపార్ట్మెంట్ లలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు.. రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే మహిళల పాత్ర చాలా అమోఘంగా ఉంటుందన్నారు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళల పక్షపాతి అని, మహిళల కొరకు డ్వాక్రా సంఘాలను కూడా స్థాపించి, మహిళల్లో చైతన్యం తెచ్చారన్నారు.. పొదుపు చేసుకుంటూ వ్యాపారాలు చేస్తూ మహిళలు లక్షాధికారులయ్యారని, ఇప్పుడు కోటీశ్వరులు అవుతామనే లక్ష్యంతో వారు ఉన్నారని, ఇది ముఖ్యమంత్రి వల్లనే సాధ్యమయిందని ఎంపీ తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధితో వుందన్నారు.. ఎన్నడూ లేని విధంగా, జిల్లాలో MSME క్రింద, బిసి వెల్ఫేర్ , ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల ద్వారా మహిళలకు రూ.150 కోట్లతో చేయూత అందించడం జరుగుతోందన్నారు. మహిళలందరూ చైతన్యవంతులై, తమ పిల్లలను కూడా బాగా చదివించి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు..ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నారని, కుటుంబ బాధ్యతల్లో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తారన్నారు..
పొదుపు మహిళలు రుణాలను పొంది ఆర్థికాభివృద్ధి సాధించారని, బ్యాంకులు కూడా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఇలాగే ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసి సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కోరారు..జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1917 లో రష్యన్ రెవల్యూషన్స్ సందర్భంగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో మార్చి 8 వ తారీకును గుర్తు చేసుకుంటూ 1922 లో మార్చి 08 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల హక్కులు, అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళల కోసం దీపం 2 పథకంతో పాటు, వివిధ పథకాల ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు.. వీటిని సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి చెందాలని జేసీ కోరారు..డిప్యూటీ మేయర్ రేణుకా శిద్దారెడ్డి మాట్లాడుతూ మగ పిల్లలకు చిన్నతనం నుండి బాలికల పట్ల నడుచుకునే విధానం పై అవగాహన కల్పించాలని సూచించారు.. మహిళలు చాలా సామర్థ్యం కలిగిన వారని, మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్న క్రమంలో ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు..వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇస్తోందన్నారు..మహిళా ఇంటా,బయటా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తోందని, తన కుటుంబం ఫ్యాక్షన్ కు బలి అయినా కూడా తాను ధైర్యంగా ఉంటున్నానని, ఆడది అంటే అబల కాదని ఒక మహిళా శక్తి అని నిరూపించుకోవాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి పిల్లలను చదివించుకోవాలని, పిల్లల చదువు కొరకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కలుగచేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, డిఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఐసిడిఎస్ పిడి నిర్మల, మెప్మా పీడీ శివ నాగ లీల, డిఆర్డిఏ పిడి రమణా రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అరుణ మహిళల గొప్పతనం గురించి కొనియాడారు..
ఈ కార్యక్రమంలో కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి దీప్తి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి జయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి మైనార్టీ కార్పొరేషన్ అధికారి సబిహా పర్వానా, రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి, కర్నూలు అర్బన్ తహశీల్దార్ వెంకట లక్ష్మీ, తదితర జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు..అంతకు ముందు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎంపీ, జేసీ తదితరులు సందర్శించి, డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు..

Author

Was this helpful?

Thanks for your feedback!