ఎ.ఎన్.యు.ఆధ్వర్యంలో బయాలజిస్ట్స్ లకు శిక్షణా తరగతులు
డిసెంబరు 09 నుండి21వ తేదీ వరకు ఆన్లైన్ లో బోధన
జీవ శాస్త్ర బోధనలో దిశా నిర్దేశం చేసే లక్ష్యంతో నిర్వహణ
నేడు ‘సమాచార ప్రతి’ని ఆవిష్కరించిన ఎ.ఎన్.యు.తాత్కలిక వీసీ,రిజిస్ట్రార్
నాగార్జున వర్సిటీ, న్యూస్ వెలుగు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వృక్ష -సూక్ష్మ జీవశాస్త్ర విభాగాలు,సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో బయాలజిస్ట్స్ లకు శిక్షణా తరగతులు నిర్వహించుతున్నాయి.డిసెంబరు 09 వ తేదీ నుండి21వ తేదీ వరకు ఆన్లైన్ తరహాలో బోధనా తరగతులు ఉంటాయని కార్యక్రమ అధ్యక్షురాలు సూక్ష్మజీవ శాస్త్ర విభాగ ఆచార్యులు ఆచార్య ఎ. అమృతవల్లి బుధవారం పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు కార్యశాలను సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయస్థాయిలో జరగనున్న “పైతాన్ ప్రోగ్రామ్ ఫర్ బయాలజిస్ట్స్ ” ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, విద్యార్థుల కార్యశాలకు సంబంధించిన సమాచార ప్రతిని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు, తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం,ఆచార్య అమృతవల్లి తదితరులు ఆవిష్కరించారు. ఈ శిక్షణా తరగతుల నిర్వహణ కార్యక్రమ కార్యదర్శులుగా ఆచార్య కే. మల్లికార్జునరావు, టి. క్రాంతి కుమార్ లు వ్యవహరించనున్నారు. జీవశాస్త్రము పై ఆసక్తితో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవశాస్త్రంలో నిపుణత సాధించాలని కార్య క్రమ నిర్వాహక బృందం బుధవారం తెలిపారు.