
రక్షణ రంగంలోను AI ని తిసుకోస్తాం : కేంద్రమంత్రి
ఢిల్లీ :
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రక్షణ రంగంలో కొత్త పరిశోధనలకు పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటి మండి 16వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రక్షణలో AI-ఆధారిత పురోగతి అవసరాన్ని నొక్కి చెప్పారు.
రక్షణ తయారీలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, దాదాపు 70 శాతం రక్షణ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. 2023-24 సంవత్సరంలో భారతదేశం 23,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ సామగ్రిని ఎగుమతి చేసిందని, 2029 నాటికి దీనిని 50,000 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు.
ఐఐటీ మండిలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు రక్షణ మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు జైరాం ఠాకూర్ కూడా పాల్గొన్నారు.