
అక్రమ నిర్మాణాలపై నోటీసులు: నగర కమిషనర్
అక్రమ నిర్మాణాలపై నోటీసులు: నగర కమిషనర
కర్నూలు (న్యూస్ వెలుగు) : నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడాలని, వెంటనే నోటీసులు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, సిబ్బందితో కలిసి ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను చెప్పగా, జాప్యానికి కారణాలను అడిగి, చట్టపరిధిలో వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి, ఇతర కార్యదర్శుల సహాయం తీసుకుని అక్రమ నిర్మాణాలు గుర్తించాలని అన్నారు. అప్రూవల్ ఉందా? ప్లాన్ విరుద్ధంగా ఏమైనా నిర్మాణాలు చేస్తున్నారా? చెక్లిస్ట్ ప్రకారం పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు వెంటనే నోటీసులు జారీ చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్, డీసీసీ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, సిబ్బంది అనంత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
