అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
కర్నూలు,అక్టోబర్ 25: పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకే అందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ తెలిపారు.
శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగం పక్కన ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పేదలకు అవసరమైన ప్రదేశాలలో 3 అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 2 అన్న క్యాంటీన్ లను ప్రారంభించుకున్నామని ఈ రోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన 3వ అన్న క్యాంటీన్ ప్రారంభించుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాయలసీమలోనే అతిపెద్ద ఆసుపత్రి అని, ఇక్కడికి ప్రజలు నిరంతరం పెద్ద సంఖ్యలో వస్తుంటారని.. ఇలాంటి వారికి తక్కువ ఖర్చుతో నాణ్యత గల ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ అన్న క్యాంటీన్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పేద ప్రజల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యతతో కూడిన అల్పాహారం, భోజనాలను అందచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ లను తీసివేయడంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజలకు మేలు చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలను అంచల వారిగా అమలు పరుస్తున్నారన్నారు. ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో 5 అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేశాము, కల్లూరు పరిధిలోని పరిమళ నగర్, సెట్కూర్ కార్యాలయం వద్ద, కలెక్టరేట్ ఆవరణలో, పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు సమీపంలో ఒక్కటి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ఒక్కటి మొత్తం 5 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అవసరమైన పనుల కోసం నగరానికి వచ్చే పేదలకు అన్న క్యాంటీన్ ల ద్వారా 5 రూపాయలకే ఆహారం అందించడం వల్ల ఆకలి తీరడంతో పాటు డబ్బు ఆదా అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు . తొలుత అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి, కలెక్టర్ స్వయంగా ప్రజలకు అల్పాహారాన్ని వడ్డించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి , స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్.కె ప్రకాష్, మరియు వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.