
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చర్యలు తీసుకోండి : ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పార్లమెంట్ జీరో అవర్ లో కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తిరుపతి ఎంపీ బుధవారం మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్. జూదయాప్‌లతో సమాజంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. కొంత మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ సంపాదనను ఈ యాప్‌లలో పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని పార్లమెంట్ దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.
ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలనే తలంపు చివరికి మోసాలు, దొంగతనాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నాయని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. యువత తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లు మాఫియా గ్యాంగ్‌ల చేతుల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ నియంత్రణను కూడా అధిగమించి తరచూ కొత్త పేర్లతో బెట్టింగ్ యాప్‌లు పునరావృతమవుతున్నాయని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి, ఆన్‌లైన్ బెట్టింగ్, జూద యాప్‌లపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అంతేకాకుండా, సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ యాప్‌లను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆన్‌లైన్ బెట్టింగ్ నష్టాల గురించి అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.