ఏపీలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ.. పెండింగ్ సమస్యలపై కీలక చర్చ!
అమరావతి; ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా విజయవాడకు వెళ్లారు. ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఇరు రాష్ట్రాల సీఎస్‌ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తుల పంపకంపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2024 జూలై 5 తేదీన సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై అధికారులు లోతుగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.