
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్మితే లైసెన్స్ రద్దు!
అమరావతి; మద్యం విక్రయాలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే భారీగా జరిమానాలు విధిస్తూ సోమవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే రూ.5లక్షల జరిమానా విధించనున్నారు. మద్యం షాపు పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.5లక్షల జరిమానా విధించనున్నారు. అయినా సరే తీరు మారకుండా రెండోసారి కూడా తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవే నిబంధనలు బార్ లైసెన్స్‌లకూ వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలకు సంబంధించి భారీ మార్పులు చేపట్టింది. జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేయడంతో పాటు కొత్త లిక్కర్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని వార్తలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.