
బ్లాక్ డే ను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
కర్నూలు న్యూస్ వెలుగు : నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా ఏప్రిల్ 1న ‘బ్లాక్ డే’ ను జయప్రదం చేయండి – కేంద్ర కార్మిక సంఘాల పిలుపునిచ్చింది.
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12 సమ్మెచేసినప్పటికీ లేబర్ కోడ్స్ ఏప్రిల్1 వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర బీజేపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు ఢిల్లీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్న కార్మిక సంఘాలు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ, ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ న్యూ సిటీ అధ్యక్షులు నగేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్.కృష్ణ, నక్కి లెనిన్ బాబు, రాష్ట్ర నాయకులు మునియప్ప, సీనియర్ నాయకులు మనోహర్ మాణిక్యం, నగర కార్యదర్శి వెంకటేష్ డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు సమావేశమై ఏప్రిల్ 1 వ తేదీన కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మరియు నియోజకవర్గ కేంద్రాలలో నల్లజెండాలతో, కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని, ఉద్యోగ సంఘాలు భోజన విరామ సమయంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.*
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్కోడ్ను మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధానాలు అనుసరిస్తున్నది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 2026 ఫిబ్రవరి12 న 36 కోట్ల మంది కార్మికవర్గం సమ్మె చేశారు. కనీసం కార్మిక సంఘాలతో సంప్రదింపులు చేయాలన్న ప్రజాస్వామిక పద్దతులు పాటించకుండా, కోట్లాది మంది కార్మికుల నిరసన గళాన్ని పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో 2026 ఏప్రిల్1 నుండి నాలుగు లేబర్కోడ్ను అమలుకు పూనుకోవడం దుర్మార్గం, అప్రజాస్వామికం. చరిత్రలో కార్మికులహక్కులను కాలరాసిన వారు చరిత్ర హీనులుగా అయ్యారు. ఆ ప్రభుత్వాలు అభాసు పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
కార్మిక వర్గం పోరాడటం తప్ప ఇంకొక మార్గంలేదు. “పోరాడితే పోయేది ఏమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప” అని కారల్ మార్క్స్ ఏనాడో నినదించారు. ఈ నాటి పాలకవర్గాలు కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెట్టడంలో భాగంగానే కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 1 వ తేది నుండి లేబర్కోడ్స్ అమలుచేస్తున్నది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్1న జరిగే ‘బ్లాక్ డే’ ని జయప్రదంచేయాలని కార్మికసంఘాలు కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాయి అని తెలిపారు.

