
కేంద్ర, రాష్ట్ర పథకాలతో నిరుద్యోగ యువతకు చేయూత
కర్నూల్ న్యూస్ వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిరుద్యోగ పేద యువతకు చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో చేయూతనందించవచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో పండిస్తున్న టమోటా, ఉల్లి, తదితర ఉత్పత్తుల మార్కెటింగ్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు రూ.10లక్షల రుణం మంజూరులో రూ. 3.50 లక్షల సబ్సిడీ ఉందన్నారు. ఇలాంటి పథకాలను యువత వినియోగించుకునేలా అధికారులు తగిన సహకారం అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆదోని, పత్తికొండ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్నటమోటా, ఉల్లి స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. టమోటాను ఒక వారం రోజులు నిల్వ చేయగలిగితే, ఇక్కడి నుండి హైదరాబాద్ కు పంపిస్తే, రైతులకు లాభం కలుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 20 రోజుల్లోపు ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో తన వద్దకు రావాలని కలెక్టర్ మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, డీఆర్డిఏ, హార్టికల్చర్, ఫిషరీస్ అధికారులను ఆదేశించారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేలా పథకం వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని, అలాగే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist