
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం ఎమ్మల్యే గౌరు చరిత
పాణ్యంo (న్యూస్ వెలుగు): పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం చింతలముని కాలనీ 35 వ వార్డు లో గృహ ప్రవేశాల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తోందని తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేస్తోందని ఆమె పేర్కొన్నారు. బీసీ, ఎస్సీలకు ₹50,000, ఎస్టీలకు ₹75,000 అదనపు ఆర్థిక సహాయం మంజూరు చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం TIDCO ప్రాజెక్టులలో మౌలిక వసతులు పూర్తి చేసి, ప్రజలకు ఇళ్లు అందజేయడానికి కట్టుబడి ఉందన్నారు. పాణ్యం నియోజకవర్గంలో PMAY అర్బన్ 2.0 కింద 501 ఇళ్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పేదల గృహస్వప్నాలను సాకారం చేయడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ….రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. త్వరలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)–రూరల్ కింద గృహనిర్మాణాలు ప్రారంభం కానున్నాయని జేసీ తెలిపారు. స్వంత స్థలం ఉండి, అర్హత కలిగిన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం PMAY పథకానికి తోడ్పాటుగా సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించేందుకు వివిధ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరచిందని తెలిపారు. అలాగే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 52 వేల ఇళ్లు మంజూరు కాగా, 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన ఇళ్లు కూడా నిర్మించుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనే కల సాకారం కావడానికి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ సూచించారు.
అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైన లావణ్య, కుమ్మరి లక్ష్మి, ఏం. కమలమ్మ, మమతా, బి. సంధ్య తదితరులకు శాంక్షన్ లెటర్ లు అందజేశారు.
బి. కృష్ణ వేణి, రేణుక ఇళ్లకు జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే గృహ ప్రవేశాలు చేయించి, లబ్ధిదారులతో మాట్లాడారు..
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ లు మురళి నాయుడు, మంజునాథ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పి వి సుబ్బయ్య, 35 వార్డ్ స్థానిక నాయకులు రవి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

