
మైనింగ్ పై నిఘా పెంచండి : సీఎం చంద్రబాబు
ఏపీ సచివాలయం న్యూస్ వెలుగు : రాష్ట్రంలోని గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. లీజుకిచ్చిన గని ప్రాంతం కాకుండా ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించి ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ లాంటి వివిధ ఖనిజాల ముడి సరుకును ఎగుమతి చేయడంతో పాటు వాటికి వాల్యూ యాడ్ చేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టాలని సూచించారు. మాంగనీస్ ఖనిజం ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్-సిలికా శాండ్ ద్వారా సొలార్ ప్యానెళ్లు, సొలార్ పీవీ సెల్స్ ఉత్పత్తి, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్-పాలిషింగ్ పరిశ్రమలు ప్రొత్సహించాలని అన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని, విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

