వీడిన పార్శిల్‌ మృతదేహం చిక్కుముడి.. అదుపులో నిందితులు : ఎస్పీ

వీడిన పార్శిల్‌ మృతదేహం చిక్కుముడి.. అదుపులో నిందితులు : ఎస్పీ

అమరావతి : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి  జిల్లా యండగండిలో పార్శిల్‌లో వచ్చిన మృతదేహం  కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ వెల్లడించారు. ఆస్తిని కాజేసేందుకు వేసిన పన్నాగంలో పర్లయ్య అనే అమాయకుడిని హత్య చేశారని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌ వర్మ, రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉందన్నారు.

ఎండకల్లి గ్రామంలో నివాసముంటున్న తులసి అనే మహిళ ఇంటికి పార్శిల్‌ రాగా అందులో శవం ఉండడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ముందుగా మృతదేహం ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టామని ఎస్పీ వెల్లడించారు.

రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు తులసి ,రేవతి ఉన్నారు. రంగరాజుకు 2.50 ఎకరాల పొలం, కొంత స్థలం , బంగారం ఉన్నాయి. కూతుళ్ల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయని పోలీసులు తెలిపారు. తులసికి విడాకులై ఇంటి వద్ద ఉంటుంది. రెండో కుమార్తె రేవతికి 2016లో శ్రీధర్‌ వర్మతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని రోజులకు రేవతితో దూరంగా ఉంటున్న శ్రీధర్‌ ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగిన సుష్మతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరు కలిసే ఉంటున్నారు.

ఇటీవల ఇంటిని నిర్మించుకుంటున్న తులసికి ఆర్థిక అవసరాలను గుర్తించి సహాయం కోసం సోషల్‌ మీడియాలో ప్రకటన ఇచ్చుకుంది. తులసి అవసరాన్ని గుర్తించిన శ్రీధర్‌ తులసిని భయపెట్టి ఆస్తి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి అమాయకుడైన పర్లయ్యకు మద్యం తాగించి గొంతుకు సెలైన్‌ తాడు బిగించి దారుణంగా హత్య చేశాడు.

చెక్కపెట్టెలో డెడ్‌బాడీ చూపించి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని బెదిరించాడని, ఆమె అంగీకరించక పోవడంతో అక్కడి నుంచి నిందితుడు వెళ్లిపోగా తులసి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. ఈ కేసులో డెడ్‌బాడిని తులసికి పంపించేందుకు ప్రియురాలు సుష్మ సహకరించిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త క్రమంలో మచిలిపట్నంలో లాడ్జీలో ఉన్న నిందితుడిని, సుష్మ, ఆమె కూతురును పట్టుకున్నట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS