
కార్మికుల హక్కులు హరిస్తే ప్రభుత్వాలకి పతనం తప్పదు: సీపీఐ
డోన్ ప్రతినిధి -( న్యూస్ వెలుగు ):కార్మికుల హక్కులను కాలరాస్తే ప్రభుత్వ పతనానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుంకయ్య, సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు హెచ్చరించారు, పట్టణంలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల నందు ఏఐటీయూసీ కార్మిక సంఘం బేతంచర్ల రెండవ మండల మహాసభను ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఏలియా అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభ కి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు పి.సుంకయ్య, ఎన్.రంగనాయుడు, మండల కార్యదర్శి భార్గవ్.యన్న హాజరయ్యారు, మహాసభల ప్రారంభ సూచికగా ఏఐటియుసి అరుణ పథకాన్ని పి.సుంకయ్య ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ…
ఏఐటీయూసీ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం, భారత కార్మిక హక్కుల సాధనకై కార్మిక వర్గ పోరాటాల నుండి 1920 అక్టోబర్ 31న ముంబై నగరంలో ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ ల నాయకత్వంలో సామ్యవాద రాజ్య స్థాపన లక్ష్యంగా, అంతర్జాతీయ కార్మిక వర్గ శ్రేయస్సు ధ్యేయంగా ఆవిర్భవించిన కార్మిక సంఘం ఎఐటియుసీ, దేశ స్వాతంత్ర్య సముపార్జన కొరకు పోరాటాలు నిర్వహించిన సంఘం ఏఐటియుసీ, కార్మిక హక్కుల కొరకు, జీవన మెరుగుదల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన ఫలితంగా దేశంలో అనేక కార్మిక చట్టాల రూపకల్పన జరిగిందని, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 విధానాన్ని తీసుకురావడం చాలా దారుణం అన్నారు,
జిల్లా విభజన తర్వాత గత మూడు సంవత్సరాల కాలంలో కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను చేపట్టి కార్మికులకు ఉద్యోగులకు ఏఐటియుసి ఎర్రజెండా అండగా నిలబడి పోరాటం చేసిందని రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించేందుకు నందికొట్కూరులో ఏప్రిల్ 6,7 తేదీలలో జరిగే ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోడ్స్ గా తీసుకొని వచ్చి కార్మిక హక్కులను హరించారని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారని కార్పొరేట్లకు కొమ్ముగాస్తు 8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కి రోజుకు 12 గంటలు పని చేయాలని అతివేగంగా చట్టాన్ని తీసుకురావడం కార్మికులను శ్రమ దోపిడీ చేయడం, బానిసలుగా చేయడం దుర్మార్గమని ఈ పాలకుల వ్యతిరేక విధానాలపై మరింత తీవ్రమైన ఉద్యమాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఏఐటియుసీ మండల నూతన కమిటీ ఎన్నిక:
ఏఐటియుసి మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఏలియా, తాలూకా,తిరుమలేష్, ఉపాధ్యక్షులుగా లక్ష్మన్న, నాగేంద్ర, నాగరాజు, సహాయ కార్యదర్శులుగా మహాలక్ష్మి, మారుతి, సెంట్రింగ్ రాజు, కోశాధికారిగా ధనుంజయ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ జిల్లా సమితి సభ్యులు సూర్యచంద్రుడు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి డి.దస్తగిరి, ఏఐటీయూసీ నాయకులు ఇమ్మానుయేల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, ఏఐటియుసీ నాయకులు బాలు, గోపి, మధు, చిరంజీవి, శ్యామ్ బాబు, నాగేంద్ర, శ్రీనివాసులు, రామదాసు, శివ, విధాత, తదితరులు పాల్గొన్నారు.

