
ఓర్వకల్లులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు జిల్లా ఓర్వకల్లు హ హ పారిశ్రామిక పార్కులో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ మరియు ఇండియాకు చెందిన కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అమరావతిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమైనట్లు మంత్రి భరత్ తెలిపారు. రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని సమావేశంలో పెట్టుబడిదారులతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. చర్చల అనంతరం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ. 14వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారన్నారు. జనవరి రెండవ వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కంపెనీతో ఎంవోయూ చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక అభివృద్ధిని పెంచడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు రానున్న రోజుల్లో మరెన్నో పెట్టుబడులు వస్తాయన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్‌తోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఆవిష్కరణలు మరియు పురోగతికి కేంద్రంగా కర్నూలు జిల్లా మారబోతుందని మంత్రి టి.జి భరత్ తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar