
టిబికి నూతన చికిత్సా విధానం – కేంద్రం అనుమతి
ఢిల్లీ , న్యూస్ వెలుగు: టిబికి నూతన చికిత్సా విధానానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా అనుమతించింది. జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టిఇపి) కింద అత్యంత ప్రభావవంతమైన, స్వల్ప చికిత్సా ఎంపిక అయిన బిపిఎఎల్‌ఎంకు కేంద్రం అనుమతించింది. ఈ నూతన చికిత్సలో బెడాక్విలిన్, లైన్‌జోలిడ్ (మోక్సిఫ్లోక్సాసిన్‌తోనూ లేదా లేకుండా)తో పాటు కొత్తగా యాంటీ – టిబి డ్రగ్ ప్రిటోమానిడ్‌ను కూడా చేర్చారు. ప్రిటోమానిడ్‌ను ఇప్పటికే దేశంలో వినియోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) ఆమోదించింది. బెడాక్విలిన్, ప్రీటోమానిడ్, లైన్‌జోలిడ్, మోక్సిఫ్లోక్సాసిన్ అనే నాలుగు ఔషధాల కలయికతో కూడిన బిపిఎఎల్‌ఎం చికిత్స విధానం ఇప్పటి వరకూ వినియోగిస్తున్న ఎండిఆర్ చికిత్సా విధానం కంటే మరింత సురక్షితం, ప్రభావవంతం, వేగవంతమైన ఎంపికగా నిరూపించబడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘సాంప్రదాయ ఎండిఆర్ చికిత్స విధానం తీవ్రమైన దుష్ప్రభావాలతో 20 నెలల వరకు ఉంటుంది. నూతన చికిత్సా విధానం బిపిఎఎల్‌ఎం కేవలం ఆరు నెలల వ్యవధిలోనే టిబి నయం చేయగలదు’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య పరిశోధనా విభాగం ఇచ్చిన సాక్ష్యాధారాల తరువాత ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.