డిల్లీ : పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కోసం నేషనల్ అడాప్టేషన్ ఫండ్ కింద 125 జిల్లాలను దత్తత తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. దత్తత తీసుకున్న కరువు పీడిత జిల్లాల్లో 107 జిల్లాలు మధ్యస్థ, అధిక మరియు చాలా ఎక్కువ కరువును ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ నిధిని 2015లో ప్రవేశపెట్టినప్పటి నుండి, 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 847 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టు వ్యయంతో 30 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వాతావరణ మార్పుల కోసం నిధి వ్యవసాయం, పశువులు, నీరు, తీరప్రాంత చిత్తడి నేల నిర్వహణ, అటవీ సంరక్షణ, తీరప్రాంత రక్షణ మరియు నిర్వహణ కోసం ఉపయోగించబడుతుందన్నారు. భారత వాతావరణ శాఖ కరువు పీడిత జిల్లాల వివరాలను అందిస్తుందని మంత్రి లోక్సభకు తెలిపారు.