ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్షల (Inter Exams ) తేదీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షల తేదీలను వెల్లడించిన కొద్ది నిమిషాల్లోనే ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
దువుపై దృష్టిని సారించేందుకు సరైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల భయంతో ఒత్తిడికి లోనుకాకుండా, ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ‘ ఆల్ ది బెస్ట్ ’అని ఆయన తెలిపారు.
పదవ తరగతి పరీక్షల తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల (10th Exam) షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. 17న ఫస్ట్ లాంగ్వేజ్,19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్,28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరుగనున్నాయని వివరించారు.
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను విడుదల చేసి పాఠశాలలకు పంపించింది. దీని ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. ఈనెల1 నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు మార్చి 10వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.