ప్రజలంతా సోదర భావంతో జీవించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్
న్యూస్ వెలుగు, కర్నూలు; కుల, మత బేధాలు లేకుండా ప్రజలందరూ సోదర భావంతో జీవించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగర పాస్టర్లకు ఏర్పాటుచేసిన క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించారు. ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తన కుమారుడు టి.జి భరత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. విజయవాడలో కలెక్టర్ల సమావేశం ఉండటం వల్ల ఈ సంవత్సరం పాల్గొనలేకపోయారన్నారు. అందుకే తాను పాస్టర్లందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వివరించారు. ఏసు ప్రభువుకు మనుషులకు అనుసంధానంగా ఉండే వాళ్లు పాస్టర్లని టి.జి వెంకటేష్ చెప్పారు. మానవ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదన్నారు. కులాలు, మతాల పోటీలో ప్రజలందరూ బ్రతుకుతున్నారని.. అయితే మంచిగా సోదరుల్లా బ్రతకాలని అన్ని మతాల దేవుళ్లు చెబుతున్నారని తెలిపారు. ఇక తాను ప్రజలందరికీ మంచి చేస్తూ ఉన్నానని, చాలా ప్రాంతాల్లో చర్చిలు నిర్మించానని, వీలైనంత సహకారం అందిస్తూ వచ్చానన్నారు. ఇదే సమయంలో పాస్టర్లు, ప్రజలు కూడా మంచి చేసే వ్యక్తులెవరో గ్రహించాలని కోరారు. మంచి పనులు చేసే వాళ్లను ఎన్నుకుంటే దేశం బాగుంటుందన్నారు. అప్పుడే ఏసు ప్రభువు కూడా దీవిస్తారన్నారు. పాపులను ఎన్నుకుంటే ప్రజలకే పాపం వస్తుందని చెప్పారు. తప్పులు చేస్తూనే ఉంటే ప్రభువు క్షమించరని పేర్కొన్నారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడమే కాకుండా మంచి కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఇక గత ప్రభుత్వం పాస్టర్ల కోసం రూ. 40 కోట్లు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించిందన్నారు. తన కుమారుడు టి.జి భరత్ నిజాయితీగా పనిచేస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి టి.జి భరత్ అని టి.జి వెంకటేష్ అన్నారు. కార్యక్రమం అనంతరం పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బి.ఏ ప్రసాద్ రావు, పాస్టర్లు బి. ఆనంద రావు, శాంషన్, వానాల డేవిడ్ రాజ్, ధనరాజు, ఎం. రాజు, రూబేన్, ఆంథోని, తదితరులు పాల్గొన్నారు.