
మహిళలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
పత్తికొండ ఇంచార్జి జడ్జి శ్రీవల్లి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని,వాటిపై అవగాహన కలిగి ఉండి చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ ఇంచార్జి జడ్జి ఏవీఎస్ శ్రీవల్లి తెలిపారు.శనివారం కర్నూలు జిల్లా,తుగ్గలిలోని ఎంపీడీవో కార్యాలయం నందు సమావేశ భవనంలో పత్తికొండ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ “మహిళ న్యాయ విజ్ఞాన సదస్సు” కార్యక్రమం నిర్వహించారు. ప్యానల్ అడ్వకేట్ సురాజ్ నబి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పత్తికొండ జూనియర్ సివిల్ కోర్ట్ ఇంచార్జి జడ్జి ఏవీఎస్ శ్రీవల్లి,తుగ్గలి తహసిల్దార్ రమాదేవి,ఎంపీడీవో విశ్వమోహన్, పత్తికొండ సిడిపిఓ లలిత,తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తి,వెలుగు ఏపీఎం రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జి జడ్జి శ్రీవల్లి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల్లో మార్పు రావాలని,ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంత మహిళలు బాగా చదువుకుని తమ కాళ్ళమీద తాము నిలబడాలని తెలిపారు.భారత రాజ్యాంగం మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చిందని సూచించారు. అన్యాయం జరిగినప్పుడు మహిళలు వెంటనే పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలని, అక్కడ న్యాయం జరగకపోతే స్థానిక కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థలో అధికారులను సంప్రదించాలని తెలిపారు.డబ్బులు పెట్టి అడ్వకేట్లను పెట్టుకోలేని సమక్షంలో ఒక తెల్ల పేపర్ మీద రాసి ఇస్తే మండల న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయం పొందవచ్చని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులు తహసిల్దార్ రమాదేవి,ఎంపీడీవో విశ్వ మోహన్,సీనియర్ న్యాయవాది కాశీ విశ్వనాథ్,ఎస్సై కృష్ణమూర్తి,సిడిపిఓ లలిత మాట్లాడారు.తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుండి వచ్చిన కిట్లను మహిళలకు అందించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగరాజు, వెలుగు ఏపీఎం రాధాకృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్లు సుమిత్రమ్మ,అంబిక, నాగేశ్వరమ్మ,న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది రాఘవేంద్ర,ప్రసాద్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.