రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో ఇంజినీర్ల కొరత కనిపించని నియామకాలు

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో ఇంజినీర్ల కొరత కనిపించని నియామకాలు

అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఏటా ఉద్యోగ విరమణ చేస్తున్న పోస్టుల్లో కొత్త నియామకాలు చేసేందుకు ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో ఉన్న ఇంజినీర్లపైనే పనిభారం పడుతోంది. ఆరేళ్లుగా ఒక్క ఇంజినీరింగ్‌ పోస్టుకు కూడా నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. విద్యుత్‌ సంస్థల్లో ఇంజినీర్ల నియామకం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎఇఇ) స్థాయి నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి ఉద్యోగోన్నతులు పొందుతారు. మొత్తం మూడు విద్యుత్‌ సంస్థల్లో మంజూరు పోస్టులు సుమారు 7,500 ఉంటే 5 వేలలోపు మాత్రమే సిబ్బంది పనిచేస్తున్నారు. 2,500 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. జెన్‌కోలో 80 పోస్టులతో 2017లో చివరిసారి నియామకాలు జరిగాయి. ట్రాన్స్‌కోలో 170 పోస్టులకు, డిస్కంలలో 20 పోస్టులకు 2019లో చివరి నియామకాలు జరిగాయి. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు.

నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్‌డిఎస్‌టిపిపి) మూడో యూనిట్‌కు, కడపలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ (ఆర్‌టిపిపి)లోని 600 మెగావాట్ల యూనిట్‌కు ఇప్పటి వరకు సిబ్బందిని మంజూరు చేయలేదు. ఇతర యూనిట్లలో ఉన్న సిబ్బందినే జెన్‌కో ఉపయోగిస్తోంది. అదే విధంగా విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఎన్‌టిపిపి)లో 800 మెగావాట్ల యూనిట్‌ ఇటీవల ప్రారంభమైంది. దీనికి కూడా సిబ్బందిని మంజూరు చేయలేదు. నియామకం లేకపోవడంతో ఉన్నవారికే ఇన్‌ఛార్జులుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. డిస్కంలలో ఒక్క సర్కిల్‌ చూడాల్సిన ఎఇ అదనంగా రెండు సర్కిళ్లను చూస్తున్న పరిస్థితి నెలకొంది. జెన్‌కో, ట్రాన్స్‌కోలో కూడా ఒక విభాగం చూడాల్సిన ఉద్యోగి అదనంగా మరో విభాగం చూడాల్సి వస్తోంది. పోస్టుల భర్తీ కోసం విద్యుత్‌ సంస్థలు ఆయా బోర్డు సమావేశాల్లో తీర్మానం చేసుకుని ప్రభుత్వానికి పంపాలి. అయితే ఇప్పటి వరకు జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం యాజమాన్యాలు ఇలాంటి ప్రతిపాదనలు పంపలేదు. పై స్థాయిలో ఉద్యోగ విరమణ చేయడంతో ఎఇఇ కేడర్‌ ఉద్యోగి ఉద్యోగోన్నతి పొందుతున్నారు. ఉద్యోగోన్నతి ద్వారా ఖాళీ అయిన పోస్టులను యాజమాన్యాలు అలానే వదిలేస్తున్నాయి.

ఇటీవల విద్యుత్‌ సంస్థల్లో సుమారు 500 మంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తమపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, పోస్టులు భర్తీ చేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు పలుసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. టిడిపి కూటమి ప్రభుత్వంలోనైనా పోస్టుల భర్తీ చేయాలని ఇంజినీర్లు కోరుతున్నారు. ఈ అంశంపై విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఎపిఎస్‌ఇబి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఇటీవల వినతిపత్రం అందజేసింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో తమపై తీవ్రమైన పని భారం పడుతుందని తెలిపారు. ఇది విద్యుత్‌ సంస్థలతోపాటు వినియోగదారులపైనా ప్రభావం చూపుతుందని వివరించారు.

Journalist Mahesh

Author

Was this helpful?

Thanks for your feedback!