
సీతారాముల కళ్యాణం చూతమురారండి
నేడే శ్రీ సీతారాముల కళ్యాణం, రథోత్సవ వేడుకలు.
నూతన రథోత్సవ సందర్భంగా ఊపందుకున్న శ్రీరామనవమి వేడుకలు.
శ్రీరామనవమికి ఏర్పాట్లు అన్ని పూర్తి.
శ్రీరామనవమి వేడుకలకు హాజరు కానున్న పలువురు టిడిపి ఎమ్మెల్యేలు,నాయకులు
తుగ్గలి న్యూస్ వెలుగు; శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన తుగ్గలిలో వెలసిన శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ రథోత్సవం వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు ఎం.ప్రతాపరెడ్డి స్వగృహం నుండి కలశ స్థాపన కార్యక్రమంతో సీతారాముల కళ్యాణం కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ఇంటి నుండి సీతారాములకు తలంబ్రాల బియ్యం తీసుకొని వచ్చి తుగ్గలి నాగేంద్ర దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు వీఆర్వో కిష్టారెడ్డి నివాసం నందు కుంభోత్సవం కార్యక్రమం అనంతరం సాయంకాలం 5 గంటలకు గ్రామ సర్పంచ్ రవి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు.నూతన రథోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సతీమణి పద్మావతి,పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేఈ శాంబాబు,కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు,జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి,గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తదితర శాసనసభ్యులు మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా వచ్చిన భక్తుల కొరకు శాలివాహన సంఘం వారిచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.9వ తేదీ సీతారాముల దేవాలయం నందు ఆకులు సూగయ్య కుటుంబ సభ్యులచే శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు.శ్రీరామనవమి, నూతన రథోత్సవ వేడుకలకు భక్తాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులగుదరని గ్రామ పెద్దలు తెలియజేశారు.శ్రీరామ నవమి సందర్భంగా ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్,తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తిలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.