
ఘనంగా వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు
నాగార్జున వర్సిటీ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కామర్స్ లా,సైన్స్,ఫార్మసీ కళాశాలల వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.వార్షికోత్సవ వేడుకలకు నింగి వర్షించింది నేల హర్షించింది అనే చెప్పవచ్చు. విద్యార్థుల కేరింతలతో ఆకాశం ఉరకేసింది నింగి చిందేసింది!. వారి ఉల్లాసానికి నేల మురిసింది, నింగి కురిసింది! విశిష్ట వక్తల ప్రసంగాలు విద్యార్థుల భవిష్యత్తు సూచికగా నిలిచాయి.
గురువారం వర్సిటీలో జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా హైదరాబాదులోని సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ మతి ఎమ్ బాల లత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతికత ఎంత పెరిగినా వెలకట్టలేని బంధం గురు శిష్యుల అనుబంధం అని కొనియాడారు.
విద్యార్థులలో ప్రతిభ తోపాటు స్థిరత్వం ముఖ్యమని సూచించారు. వ్యక్తి తలుచుకుంటే ఒక వ్యవస్థగా మారి, ఒక గొప్ప శక్తి కాగలడని ఆమె విద్యార్థులకు ఉద్బోధించారు. నిబద్ధత కలిగిన వారు ఏదైనా సాధించవచ్చని ఒక గొప్ప ఉదాహరణగా ఎలన్ మస్క్ జీవితాన్ని ఉదహరించారు.
మరో గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర గ్రీవిన్స్ సెల్ అధికారిగా విధినిర్వహణలో ఉన్న చిటికెల చిన్నారావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న సమర్థ్యాలను , అభిరుచులను గుర్తెరిగి ఆ దిశగా కృషి చేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చిన్నారావు పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులు తమ విద్యా భ్యాసంతో పాటుగా నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే అనేక రంగాలలో నిష్ణాతులుగా మారవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఉపాధి పొందడమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని కల్పించే విధంగా మారాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవన విధానం ఉన్నప్పుడే ఉన్నతి సాధించగలరని పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేదించాలని సూచించారు. ఎ ఎన్ యు తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విధానాలను అందిపుచ్చుకోవాలని కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికత నేడు సమాజంలోఅన్ని రంగాలలో ఎక్కువగా ఉంటున్నదని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సృజనాత్మకతతో ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి ఎ ఎన్ యు ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ సభాధ్యక్షత వహించారు. ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ కళాశాలల దినదినాభివృద్ధిని సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలకు గతంలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన ప్రస్తుత రెక్టార్ ఆచార్య కే రత్నషీలామణి, ఆచార్య కే గంగాధరరావు,చంద్రశేఖర రావు లను సన్మానించారు. ఈ వేడుకలలో ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులైన ఆచార్య ఎమ్ త్రిమూర్తి రావు,ఆచార్య వై అశోక్ కుమార్, ఆచార్య ఎన్ వి కృష్ణారావు, ఆచార్య పూర్ణచంద్రరావు లను వర్సిటీ వీసీ రెక్టార్ రిజిస్ట్రార్,ఓ ఎస్ డి తదితరులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం కు ఆచార్య ఎమ్ త్రిమూర్తి రావు,ఆచార్య సీ హెచ్ లింగరాజు, డాక్టర్ రవి శంకర్ రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఐ ఐ ఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కే వీరయ్య, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీమతి ఏ ప్రమీల రాణి పాల్గొన్నారు. ఈ వేడుకలలో దివ్యాంగ కళాకార బృందమైన స్వర నేత్ర వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. జానపద గాయకులు దామోదర గణపతి రావు బృందం జానపద గీతా లను ఆలపించారు. చలనచిత్ర గాయకురాలు సాయి శిల్ప తన సినీ గీతాలతో విద్యార్థినీ విద్యార్థులను అలరించారు. వర్సిటీలోని డాన్స్ విభాగం వారు శాస్త్రీయ పాచ్చాత్య నృత్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు విద్యార్థి బృందాలకు బహుమతుల ప్రధానం చేశారు.