
నిప్పు కణిక
అంతరంగమే!.
ఓ!..”అనితర భావ వీచిక!!! …
నిప్పు కణిక
మనిషి మనసు వికసించి మహోన్నతుడు కావాలి… ఐతే
ముదిరి ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా
మరో జీవిలా మారుతున్నాడు!
ఇంకొకరి జీవిత కష్టంతో ఎదిగి కుట్రల తో
ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నాడు
గోడ మీద పిల్లి అవుతున్నాడు!
మాటల గారడీతో బహు నాలుకలలో
శేషుడినీ మించి పోతున్నాడు!
స్వార్థపరులు తమ స్వప్రయాయోజనాల కోసం ఇతరుల
జీవితాలను చిది మేస్తున్నారు!
సాటి మనిషి కొంచెం చిరునవ్వుతో కనిపించినా
మనిషి ఓర్వలేని అసూయాగ్రస్తుడు అవుతున్నాడు!
దశాబ్దాలుగా వెలుగులోకి రాని ‘స్వాతి కిరణo’లెన్నో
తోటి మనిషి ప్రగతికి అడుగడుగునా అడ్డుపడే
సైంధవుడు అవుతున్నాడు!…
ఎల్లలు దాటిన స్వార్థంతో ఇతరుల జీవితాల హక్కులనూ
హరించే దురహంకార దుర్యోధనుడు అవుతున్నాడు!
‘అదృష్టం కొద్దీ’ వచ్చిన అధికార మదంతో నీతిని విడిచి,నిజాయితీ ని మరచి,విలువలనే’వలువ లూడ దీసే
దుశ్శాసనులవుతున్నారు!
“ఐనప్పటికీ…ముందుకు సాగాలి”
మానవ నిత్య జీవిత కురుక్షేత్రం లోకి!!
ప్రజ్వలించే నిప్పు కణికను తిరగవేసినా జ్వాల పైకి రేగినట్లు,
న్యాయమే గెలుస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించినవేళ
ప్రపంచమే ఓ ధర్మస్థలి గా వసుదైక కుటుంబం అవుతుంది!
వంచనతో పేకమేడలా నిర్మించుకున్న
స్వార్థ పరుల కీర్తి ప్రతిష్టలు
కూలిపోడానికి ‘ఒక్క నిజం’ చాలదా!??
తెరవెనుక చేసిన కుట్రలు,ప్రాకృతిక విరుద్ధ మంత్రాoగం తెరమీదకు వస్తే
నీ గతేమగునో?
=======================
భావి తరాలకు ధర్మ బద్దంగా విలువలతో పుణ్యంతో కూడిన ఆస్థి పాస్తు లిచ్చి సర్వోన్నతుడివవుతావో లేక
అధర్మంతో గర్వంతో ప్రాణంపోసినోళ్ల భవిష్యత్తు బలితీసుకుని,
నమ్ముకున్న జీవితాలపై కొట్టి, వికటాట్టహాసం చేస్తూ…
విధికీ విధాతకూ సవాలు విసిరి
ప్రకృతికీ పంచభూతాలకూ ధర్మదేవతకు
ఎదురెళ్లి,
పాపాన్నీ పాపపు సొమ్మును ఇచ్చి సర్వనాశనం చేస్తావో
అంతా నీ చేతుల్లో నే ఉంది!.
‘నీ భవిష్యత్తు’ నీ వారసత్వపు భవిత నీ ‘చేత’ల్లోనే!!
…ఇదే…
యుగ యుగాలు తర తరాలు
అఖండ భారతావనికి చూపిన
సనాతన ధర్మం!
ఇదే సత్యం! ఇదే నిత్యం!ఇదే నిత్య నూతనం!
యతో ధర్మః స్తతో జయః!
త్రివిక్రమ్ సుఖవాసి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం