
గొప్ప భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
న్యూస్ వెలుగు కడప : శుక్రవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాల్లో మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ , ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి , రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్వ గురువులందరికీ అభినందనలు తెలియజేశారు.
ఉత్తమ పౌరులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపై ఉంటుందన్నారు. అందువల్ల ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందని అన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు తమ ఉత్తమ ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. మంచి సమాజాన్ని, గొప్ప భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. నేటి సమాజ పోకడలను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.