
553 కోట్లకు కుదిరిన ఒప్పందం :సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC), విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) అధికారులు రుణ ఒప్పందం పై సంతకాలు చేశారు. విశాఖపట్నంలోని మధురవాడ జోన్–2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ఈ రుణం తో అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం రూ.553 కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో రూ.498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది. అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు దీనికి వినియోగించనున్నారు.
జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు. త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్ – లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం – నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు.
నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భజలాలు కలుషితం కావు, పర్యావరణానికి మేలు చేస్తుంది. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో నగరాల ఆర్థిక స్వయంప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టయ్యింది.