
ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, న్యూస్ వెలుగు :రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా పూర్తి స్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ఆర్థికశాఖకు సూచించారు. 15 శాతం మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకూ ఈ ప్రణాళికల్ని సమర్ధంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆర్ధిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీరు, విద్యుత్ లాంటి వనరుల్ని వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైనంత మేరకు అందిస్తున్నామని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ధికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. అలాగే గత పాలకుల నిర్ణయాల కారణంగా తలెత్తిన రూ.4600 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తి అయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరతా లేదని కేంద్ర సహకారంతో వాటిని పూర్తి చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్వోదయ, సాస్కి లాంటి వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగానే పథకాలను అమలు చేస్తామని సీఎం అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత పాలకులు నిర్దయగా మూసివేశారని.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నార్తుల కడుపు నింపేలా రాష్ట్రవ్యాప్తంగా 269 క్యాంటీన్లలో భోజనం పెడుతున్నామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో సామర్ధ్యంతో పాటు సులభతరమైన విధానాల ద్వారా పెట్టుబడులు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

