
పత్తికొండలో “సబ్ కోర్టు” ఏర్పాటు చేయాల్సిందే
కాలినడకతో న్యాయవాదుల నిరసన
పత్తికొండ , న్యూస్ వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ తో పాటు డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు కారప్ప, ఎల్లారెడ్డి,సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల వరకు న్యాయవాదులు కాలినడకతో వచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 2014 శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హోసూరు పర్యటనలో 90 రోజుల్లో కర్నూల్ కి శాశ్వత హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారని గుర్తు చేశారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు సుదూర ప్రాంతంలో ఉన్న విజయవాడ హైకోర్టుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ లా-మినిస్టర్ గారిని కలిసి వివరించారని, కానీ లా మినిస్టర్ ఇప్పటివరకు సబ్ కోర్ట్ గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అందువల్ల పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చొరవ చూపి పత్తికొండలో సబ్ కోర్ట్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కర్నూల్ బార్ అసోసియేషన్ నేతృత్వంలో వివిధ దశలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కృష్ణయ్య, దామోదరాచారి, రవి ప్రకాష్, నాగభూషణం రెడ్డి, నెట్టేకల్లు, రవి, నరసరావు, కబీర్, ఇలియాస్, నరసింహులు, వాసు, సుధా కృష్ణ, మున్నయ్య, అరుణ్, అలీ, శ్రీనివాసరెడ్డి, వీరస్వామి, మధు, సాంబ, నాగరాజు, వీరేష్, బషీర్, రామంజి, లక్ష్మన్న, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు

