
హెచ్ఐవీపై అపోహలు వీడి అవగాహన పెంచుకోవాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు : ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ఆదేశాల మేరకు డిషా హాండ్స్ ఎస్ఈడీ నియంత్రణ సంస్థ, పత్తికొండ ఆధ్వర్యంలో తుగ్గలి కేజీబీవీ పాఠశాలలో సుఖవ్యాధులు, హెచ్ఐవీ/ఎయిడ్పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ రమణ ఎంఈసిఏ రామాంజనేయులు మాట్లాడుతూ, విద్యార్థులకు హెచ్ఐవీ/ఎయిడ్స్, సుఖవ్యాధులు, వాటి వ్యాప్తి, నివారణ మార్గాలు, పరీక్షలు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తితో సాధారణంగా మాట్లాడటం, చేతులు కలపడం, కలిసి భోజనం చేయడం, ఒకే తరగతి గదిలో ఉండటం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి చెందదని వివరించారు. హెచ్ఐవీ వ్యాప్తి చెందే ప్రధాన మార్గాలపై అవగాహన కల్పిస్తూ, అపోహలకు లోనుకాకుండా అవసరమైన సమయంలో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యువతకు హెచ్ఐవీ/ఎయిడ్స్, సుఖవ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి గౌరవం, సహకారం అందించాలని విద్యార్థులకు సూచించారు. యువత సరైన ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుని, అపోహలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన ఆరోగ్య ప్రవర్తనను అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం నీలావతి, ఓ.ఆర్.డబ్ల్యులు నీలమ్మ, మధుసూదన్, పి ఈ శ్రీ కన్య పాల్గొన్నారు.

