
సమయపాలన గాలికొదిలిన కూకటికొండ అంగన్వాడీ కేంద్రం!
టీచర్,ఆయాల తీరుపై స్థానికుల ఆగ్రహంసూపర్వైజర్ పర్యవేక్షణ ఎక్కడ? అధికారుల తనిఖీలు ఏమైనా ఉన్నాయా?
దేవనకొండ(పత్తికొండ) , న్యూస్ వెలుగు :
ఆస్పరి ప్రాజెక్టు పరిధిలోని దేవనకొండ సెక్టార్,కూకటికొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నిర్ణీత సమయాల్లో కొనసాగాల్సి ఉండగా, సిబ్బంది ముందుగానే కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోతున్నారు.
చిన్నారులకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు,బాలింతలు,చిన్నారులకు అవసరమైన సేవలు అందించడం అంగన్వాడీ కేంద్రాల ప్రధాన లక్ష్యం. ఇలాంటి కేంద్రంలోనే సమయపాలన లోపిస్తే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యం ఎలా నెరవేరుతుందనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
టీచర్, ఆయాలపై చర్యలు ఎప్పుడు?
కూకటికొండ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? హాజరు రిజిస్టర్,కేంద్రం నిర్వహణ సమయాలు అధికారులు పరిశీలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సంబంధిత సూపర్వైజర్ క్రమం తప్పకుండా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్నారా లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ కేంద్రాల పనితీరు, సిబ్బంది సమయపాలన, చిన్నారులకు అందుతున్న సేవలను అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. పర్యవేక్షణ లోపిస్తే కేంద్రాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని గతంలోనూ విమర్శలు వచ్చాయి.ఉన్నతాధికారులు స్పందించాలి
కూకటికొండ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది హాజరు,పని వేళలు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై ఆస్పరి ప్రాజెక్టు అధికారులు, సీడీపీవో,సంబంధిత సూపర్వైజర్ తక్షణమే విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే తాళం వేసి వెళ్లినట్లు ఆరోపణలు నిజమైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వాస్తవ పరిస్థితిని అధికారులు ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.“అంగన్వాడీ కేంద్రాలకు సూపర్వైజర్ పర్యవేక్షణ ఉందా? లేక కేవలం రికార్డులకే పరిమితమా?” అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

