
పట్టణాల్లో ఉపాధి కరువు
న్యూస్ వెలుగు : భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదే పదే పేర్కొంటున్న మోడీ సర్కార్.. దీనికి భిన్నంగా దేశంలో మహిళా నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగం 9 శాతానికి ఎగిసిందని పిరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) గణంకాలు వెల్లడించాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికంలో ఇది 8.5 శాతంగా ఉంది. ఇదే సమయంలో 25.6 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి.. గడిచిన ఏప్రిల్ త్రైమాసికంలో 25.2 శాతానికి పడిపోవడం ఆందోళనకరం. తక్కువ మంది మహిళలు పని కోసం చూస్తున్నప్పటికీ, కార్మిక మార్కెట్‌లు వారికి తగినంత ఉద్యోగాను సృష్టించలేక పోతున్నాయి. స్వయం ఉపాధిలో క్షీణత కారణంగా ఉద్యోగ రేటు తగ్గిందని పిఎల్‌ఎఫ్‌ఎస్ డేటా వెల్లడించింది.
స్వయం ఉపాధికి ఎసరు
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం స్వయం ఉపాధిని దెబ్బతీస్తోంది. 2024 మార్చి త్రైమాసికంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల వాటా 41.3 శాతంగా ఉండగా.. ఇది ఏప్రిల్ త్రైమాసికంలో 40 శాతానికి పడిపోవడం మరింత ఆందోళనకర అంశం. సాధారణ కార్మికులుగా పని చేస్తున్న మహిళల వాటా సంబంధిత కాలంలో 6.5 శాతం నుండి 6 శాతానికి తగ్గింది. పిఎల్‌ఎఫ్‌ఎస్ రిపోర్ట్‌లో అధికారిక, అనధికారిక రంగాల్లోని ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుంది. స్వయం ఉపాధిలో కార్మికులుగా పని చేస్తున్న మహిళల వాటాలో తగ్గుదల అనేది అనధికారిక రంగంలో అవకాశాలు క్షీణిస్తున్నయనడానికి ప్రాథమిక సంకేతాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.