అత్యంత భక్తిశ్రద్ధలతో భాగవత గ్రంథాన్ని ఊరేగింపు
శ్రీ అమృతలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆళ్ళగడ్డ నుండి.
భాగవతం భక్తిరస రాజము
విశ్రాంత న్యాయమూర్తి కాశీభట్ల శివప్రసాద్
కర్నూలు, న్యూస్ వెలుగు; భాగవతం భక్తిరస రాజమని, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు హయగ్రీవుని రూపంలో బాధ్రపద మాసంలో బ్రహ్మదేవునికి ఉపదేశించాడని, బ్రహ్మ నుండి నారదునికి, నారదుని నుండి వ్యాసునికి, వ్యాసుని నుండి శుకునికి, సూతమహర్షికి, పరీక్షిత్తుకు ఇలా భూలోకంలోని మానవులను తరింప చేయుటకు భాగవతం అవతరించినదని వక్కాణించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన భాగవత సప్తాహ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబోపన్యాసం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతు భారతీయ సంస్కృతి జీవనవాహినిగా ప్రవహించాలంటే రాబోయే తరాలకు ఈ ఋషి సంపదను పంచాలని, ఆపని తిరుమల తిరుపతి దేవస్థానములతో పాటు సమాజంలోని ధార్మిక సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. భాగవత ప్రవచకులు ఉపన్యాస కోకిల, గండపెండేర సత్కార గ్రహీత డాక్టర్ వైష్ణవ వేంకట రమణ మూర్తి చేసిన భాగవత అవతారిక భక్తులను ఎంతగానో ముగ్ధులను చేసినది . అంతకు ముందు పల్లకిలో భాగవతాన్ని భజనమండళ్ళతో ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టి.వి. వీరాంజనేయరావు, ఆర్ ఎస్ ఎస్ కుటుంబ విభాగ్ ప్రముఖ్ సి.రామకృష్ణ, మాధవరావు, పుల్లయ్య, నాగరాజు, శ్రీనివాసులు రెడ్డి, రాధాకృష్ణమూర్తి, నాగరాజు, సంజీవరాయుడు, రామారావు, ఆవొపా మహిళా మండలి ప్రముఖులు సుజాతా, బైసాని ప్రసన్న, గోసేవ ప్రముఖ్ డి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.