
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన
మద్దికేర, న్యూస్ వెలుగు: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని పాఠశాలలు,అంగనవాడి కేంద్రాల్లో మంగళవారం రోజున జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం, అవగాహన నిర్వహించారు. మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీ లక్ష్మి,డాక్టర్ రాగిణిల ఆదేశానుసారం మండలంలో నులి పురుగుల నిర్మూలనపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ జ్యోతి విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలను అందజేశారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా మాట్లాడుతూ నులిపురుగుల సంక్రమణను తగ్గించడానికి అదనంగా పాటించాల్సిన సూత్రాలను వివరించారు.విద్యార్థులు గోళ్లను చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగాలని, ఆహారంపై ఎప్పుడు కప్పి ఉంచాలని, కూరగాయలు పళ్ళను శుభ్రమైన నీటితో కడగాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,బయట తిరిగేటప్పుడు బూట్లు చెప్పులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదని,ఎప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించాలని,ఏదైనా తినకముందు మరియు తిన్న తర్వాత,మరుగుదొడ్డు వాడిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా ఉంచుకోవాలని,చేతుల పరిశుభ్రత పై అవగాహన కలిగించారు. నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం,ఆకలి మందగించడం,నీరసం మరియు ఆందోళన,కడుపునొప్పి,వికారం, వాంతులు,బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నచో నులిపురుగులు ఉన్నట్లు భావించి ఆల్బెండజోల్ 400ఎంజి మాత్రలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కళాశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయని సూచించారు.ఈ నులిపురుగుల మాత్రల వలన పిల్లలకు రక్తహీనత నివారిస్తుందని,పోషకాల గ్రహతను మెరుగుపరుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు కృష్ణమ్మ,సూర్య నారాయణ,ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి, పద్మ,సరస్వతి,సువర్ణ,అంజలి,గాయత్రి హెల్త్ ప్రొవైడర్లు మంజుల మరియు ఆశా కార్యకర్తలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.