
సూపర్ సిక్స్ కథేంటి బాబు : వైఎస్ షర్మిల
అమరావతి : చంద్రబాబు 100 రోజుల పాలన ఎలా ఉంది అంటే శిశుపాలుడు 100 తప్పులులా ఉంది. YSR విగ్రహాలను కూల్చడం, వైఎస్ఆర్ పేర్లను తొలగించడానికే ఈ 100 రోజులు సరిపోయినట్లుగా ఉంది. చంద్రబాబు 100 రోజుల పాలనకు సున్నా మార్కులు వేస్తున్నాం. ప్రధాని మోడీ డైరెక్షన్‌లో బాబు 100 రోజుల సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. కనీసం 7 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిరుద్యోగులకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. లేకుంటే రూ.3వేల నిరుద్యోగ భృతి అన్నారు. అటు ఉపాధి లేదు.. ఇటు భృతి లేదు. 2014లోనూ ఇలాగే రూ.2వేలు భృతి అని మోసం చేశారు. ఇప్పుడు కూడా ఇస్తారో లేదో నమ్మకం లేదు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు అన్నారు. దీనిపైనా స్పందన లేదు. మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీలు అమలు కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంగతే లేదు.
ఈ పథకం తొందరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పథకాల అమలు పై ప్రశ్నిస్తుంటే.. రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు. మరి అప్పుల్లో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలుసు కదా.. మరి అలాంటప్పుడు ఎందుకు అలవికానీ హామీలు ఇచ్చారు. 100రోజుల పాలనపై 100 విజయాలు అంటూ కరపత్రం రిలీజ్ చేశారు. ఈ కరపత్రం చూస్తుంటే నవ్వాలో,ఏడవాలో తెలియని పరిస్థితి. వరద సహాయం కింద ఇచ్చిన 25కేజిల బియ్యం, బుడమేరు గండ్లు పూడ్చడం, అమరావతికి రూ.15వేల కోట్ల గ్యారెంటీ, ప్రజాదర్భార్‌లో అర్జీలు స్వీకరించడం, సౌదీ అరేబియాలో ఒక తెలుగు కుటుంబాన్ని స్వస్తలానికి రప్పించడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో కేంద్ర మంత్రి పర్యటించడం, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం కూడా 100 రోజుల విజయమట. బాధ్యతలను విజయాలుగా చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్ప.. ఈ 100 రోజుల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిలేదు