ఆస్తుల వివాదం.. తల్లి, చెల్లిపై పిటిషన్ వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
అమరావతి; వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్, వైఎస్ జగన్, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు. ఈవిషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ పిటిషన్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో పాటు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని తెలిపారు. 2019 ఆగస్టు 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని పేర్కొన్నారు. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ వేయగా.. సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన ఎన్‌సీఎల్‌టీ.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.