పల్లెల్లో బెల్టు దందా…!
గ్రామాలలో మద్యం డోర్ డెలివరీ
బెల్ట్ అమ్మకాలపై మౌనరాగం ఆలపిస్తున్న ఎక్సైజ్ అధికారులు
సమాచారం ఉన్న దాడులు శూన్యం
విచ్చల విడి అమ్మకాలపై దృష్టి పెట్టేనా?
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: రేషన్ డోర్ డెలివరీ లాగా మద్యం ప్రియులకు మద్యం సీసాలను ఏకంగా కోరిన చోటికి డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లోని బెల్టు షాపు నిర్వాహకులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మద్యం ప్రియులకు కావాల్సిన చోట చెప్పిన సమయానికి అందుతుండడం బండి ఆత్మకూరు మండలం వ్యాప్తంగా గ్రామాలలో సంచలనంగా మారింది. వైన్ షాపులు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండగా గ్రామాలలో 24 గంటలు మద్యం ప్రియులకు అందుబాటులో ఉంటూ వారిని మత్తు దించకుండా మత్తులోనే మునిగితేలేలా చేస్తున్నారు బెల్టు నిర్వాహకులు. గ్రామాలలో పాడుబడ్డ భవనాలు , గ్రామాల చివరలో అడ్డగా చేసుకుని బెల్టు వ్యాపారాన్ని పరుగులు పెడుతున్నారు. 24 గంటలు గ్రామాలలో మద్యం లభిస్తుందడంతో ఉదయం నుండే యువకులు, మధ్యతరగతి ప్రజలు తాగుడికి బానిసై తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.ప్రభుత్వం బెల్టు షాపులు నిర్వహించకూడదన్న నిబంధన ఉన్నపటికీ మండలంలో ఆచరణలో లేదని మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదిగాక ఒక్కొక్క వైన్ షాప్ పరిధిలో బెల్టు షాపులు అనుబంధంగా పనిచేస్తున్నాయని తద్వారా వైన్ షాప్ నిర్వాహకులతో పాటు బెల్టు నిర్వాహకులు అదనంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్న అబ్కారీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల దగ్గర బెల్ట్ షాపు నిర్వాహకుల సమాచారం ఉన్న దాడులు చేయడం మాటేంటో గాని కనీసం స్పందించడం లేదని ఆబ్కారీ శాఖ అధికారులపై మహిళలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి విడకపోతే గ్రామాలలో బెల్ట్ షాపులు కాస్త వైన్ షాపులు గా మారే అవకాశం ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.