ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. మంగళవారం రాత్రి ఏపీపీఎస్‌సీ అధికారులు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 5న జరగాల్సిన పరీక్షల ఫిబ్రవరి 23కు వాయిదా వేసినట్లు వెల్లడించారు.
డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని మార్చినట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వం డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను విడుదల చేసి రెండు నెలల వ్యవధిలోనే ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది.
ఈ పరీక్షకు 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి 92, 250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని ప్రకటించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది . అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల వల్ల అభ్యర్థుల కోరిక మేరకు రెండుసార్లు మెయిన్స్‌ను వాయిదా వేసింది. ఏపీపీఎస్‌సీ చివరకు రాబోయే ఫిబ్రవరి 23న పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.