మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే!
అమరావతి; ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జగన్‌ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని లక్ష్యంతో అందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి సంచలన విజయం సాధించారు. అలాగే 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో తన పార్టీని కూడా గెలిపించుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ప్రచారం చేయించాలని నిర్ణయించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని కాపాడుకోవాలని ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో సంచలనం సృష్టించిన పవన్ కల్యాణ్‌ను బీజేపీ కూటమి తరఫున ప్రచారానికి దించాలని ప్లాన్ చేసింది. ఇదే విషయమై పవన్ కల్యాణ్‌ను బీజేపీ అధిష్ఠానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్ 16, 17వ తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకుని అక్కడ ఓట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేసింది. ఇది కాకుండా ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది కూడా తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావించింది. అందుకే పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించుతున్నది.