ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
న్యూస్ వెలుగు, కర్నూలు. నగరపాలక సంస్థ; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు వచ్చాయి. వాటన్నింటినీ చట్ట పరిధిలో గడువులోపు పరిష్కరించాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యశాఖ అధికారి డా.కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్‌ఓ జునైద్, ఎంఈ సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ రామక్రిష్ణ, బిల్డింగ్ సూపర్వైజర్ అంజద్ బాషా, టిడ్కో అధికారులు పెంచలయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
1. భాస్కర్ నగర్‌కు చెందిన రహదారి పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న తన షాపును తొలగిస్తామని బెదిరించి జె.మల్లికార్జున్, కె.శ్రీనివాసులు అను వ్యక్తులు రూ. 30,000 ఫోన్‌పే చేయించుకున్నారని, ఇంకా పదేపదే ఇబ్బంది పెడుతున్నారని ఎస్.దావుద్ ఫిర్యాదు చేశారు.
2. జోహరపురం హౌసింగ్ బోర్డు కాలనీలో మారుతి నగర్ వైపు రహదారి అధ్వానంగా ఉందని, సిసి రహదారి నిర్మించాలని జోహరపురం హౌసింగ్ బోర్డు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.ప్రకాష్, బి.రామిరెడ్డి తదితరులు విన్నవించారు.
3. 28వ వార్డు గోపినగర్, శ్రీనివాస్ నగర్ నందు మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు సుదర్శన్ రెడ్డి, కె.రాముడు, దేవరాజు, సరస్వతి, వెంకటరాముడు తదితరులు కోరారు.
4. 24వ వార్డు లక్ష్మి నగర్ చివరి వీధిలో డ్రైనేజీ కాలువలు నిర్మించాలని సిపిఎం నాయకులు శ్రీనివాసులు, శేషాద్రి, నరసింహా రెడ్డి తదితరులు విన్నవించారు.
5. వెంకటాద్రి నగర్ నందు వేస్తున్న రహదారి తమ ఇళ్ళ వరకు నిర్మించాలని హుస్సేన్ సాహెబ్ తదితరులు విన్నవించారు.
6. స్టేడియం ప్రవేశ మార్గంలో వచ్చిపోయే వారికి మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కోరారు.
7. 17వ వార్డు ఎల్బీజి నగర్ నందు అసంపూర్తిగా ఉన్న రహదారులు, మురుగు కాలువలు పూర్తి చేయాలని స్థానికులు రాజశేఖర్, రాజు తదితరులు అర్జీ ఇచ్చారు.
8. సుల్తానీయ ఈద్గా వద్ద పైప్‌లైన్ పదేపదే లీక్ అవుతుందని, శాశ్వత పరిష్కారం చూపాలని నూర్ అహ్మద్, జహాం అహ్మద్ ఫిర్యాదు చేశారు.
9. కొండారెడ్డి బురుజు వద్ద కాలువ నిర్మాణ సమయంలో తమ షాపులు తొలగించారని, తద్వారా తాము జీవనోపాధి కోల్పోయామని, మరల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సుభాన్, నసీర్, శ్రీనివాసులు తదితరులు అర్జీ ఇచ్చారు.