నిమజ్జనానికి సర్వం సిద్ధం..
వినాయక ఘాట్‌ను పరిశీలించిన నగర మేయర్ బి.వై. రామయ్య
న్యూస్ వెలుగు కర్నూలు: నగర గణేశులకు ఘనవీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నగర మేయర్ బి.వై. రామయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక వినాయక ఘాట్‌ను మేయర్, వైయస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ,కార్పొరేటర్లు సిట్రా సత్యనారాయణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకుంటూ, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నగరం కర్నూలు అన్నారు. వినాయకచవితి పండుగ అనంతరం తొమ్మిది రోజులకు నిమజ్జనం నిర్వహించడం నగరంలో ఆనవాయితీ అని, ఆదివారం నాడు నగర గణేశుల నిమజ్జనానికి ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా, రూ.40 లక్షలతో అన్ని సౌకర్యాలు, ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లలో నీటి సరఫరా, సిసి కెమెరాలు, రహదారుల్లో విద్యుత్ దీపాలు, మైకులు, షామియానాలు, కంట్రోల్ రూమ్‌లు వంటివి ఏర్పాటు చేశామని, ఇక గణేశుల నిమజ్జనం కోసం 6 ఘాట్‌లకు 6 క్రేన్‌లు, అదనంగా మరో 2 క్రేన్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. నీళ్ళలో ఏదైనా ప్రమాదం సంభవించినా ముందుజాగ్రత్తగా గత ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉంటారన్నారు. 370 మంది నగరపాలక సిబ్బంది నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు విధులు నిర్వహిస్తారన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు సిట్రా సత్యనారాయణమ్మ, ఎం.విక్రసింహా రెడ్డి, యూనూస్ బాష, జుబేర్, సంగాల సుదర్శన్ రెడ్డి, ఎంహెచ్ఓ విశ్వేశ్వర రెడ్డి, ఏసిపి రంగస్వామి, డిఈఈ నరేష్, ఏఈలు జనార్ధన్, భాను తదితరులు పాల్గొన్నారు.