
కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి, న్యూస్ వెలుగు; ఇది ప్రజల బడ్జెట్ కాదు. మోసపూరిత బడ్జెట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన బడ్జెట్. బడ్జెట్ అంటే కేటాయింపులు. ఇది కేటాయింపులు లేని బడ్జెట్. ఇది బడ్జెట్‌నో… మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదు. చంద్రబాబు ఈ బడ్జెట్‌లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు చేయలేదు. మహిళాశక్తి కింద ప్రతి నెల రూ.1500 ఇస్తాం అన్నారు. కానీ ఈ పథకానికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అన్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.2వేల కోట్లు. అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా..? అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారు. నిరుద్యోగ భృతికి నిధులు లేవు. ఇక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.17వేల కోట్ల భారం మోపారు. పాలక పక్షం వైఖరి ఇలా ఉంటే…జగన్ వైఖరి మరోలా ఉంది. జగన్‌కి ఇది భావ్యమేనా ? మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు బాధ్యత లేదా ?. ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరట. మైకు ఇవ్వకపోవడం మీ స్వయం కృతాపారథం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? మీ అక్రమాలను,అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. అసెంబ్లీకి పోను అనడం మీ అహకారానికి నిదర్శనం. జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండి.ఇక సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని. నన్ను , సునీత, అమ్మను ఇష్టారీతిన మాట్లాడారు.