10న ఏపీ కేబినెట్ సమావేశం.. దసరా కానుకగా తీపి కబురుకు అవకాశం
అమరావతి, న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ఏపీ ప్రజలకు దసరా కానుకగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ముఖ్యమంతి ఈ ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీలో రెండురోజుల పాటు పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి తదితరులతో చర్చించిన అంశాలు, కేంద్రం సానుకూలతను సమావేశంలో వివరించనున్నారు.
రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచుతూ చట్ట సవరణ, దేవాలయాల పాలక మండళ్ల ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.