ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ  నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ బాధ్యతల్ని సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టి ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను నియమించింది. ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్  విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా ఆమె పనిచేశారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పనిచేశారు.

1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. అనురాధ నియామకానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సుముఖత తెలుపడంతో ఆమెను నియమించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.

వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఆరోపించింది. గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మేలు చేసేందుకు ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేశారని విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే మరో ఏడాది పదవీ కాలం ఉన్నా సవాంగ్‌ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!