తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవో

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విశేష ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తకోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల  శ్రీవారి ఆలయంలో ప‌లు ఆర్జితసేవలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. బ్రేక్‌ దర్శనం  స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు.

ప్రతిరోజూ 24 వేలు సర్వదర్శనం టోకెన్లు ..

భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1. 32 లక్షల రూ.300ను దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1, 250 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, 3,900 పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. లక్షలాది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని వివరించారు.

తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయిస్తామని, బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 7, 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదన్నారు.

అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించబడదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!