
ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు
ఏపీ ఎస్పీ అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతుందని కర్నూలు ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా అన్నారు. పేద ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం అమీ లియో హాస్పిటల్ సౌజన్యంతో ఏపీ న్యూస్24×7 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి పని చేసే శ్రామికులు, పేదలు, రోజువారి కూలీలు ఆరోగ్యం పట్ల అలసత్వం వీడాలని సూచించారు. అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని, ఆరోగ్యవంతులుగా ఉండి కుటుంబానికి ఆసరాగా నిలబడాలన్నారు. పేద ప్రజల కోసం దాతృత్వ సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ న్యూస్ టీవీ ఛానల్ చైర్మన్ అబ్దుల్ సత్తార్ ,రాయలసీమ పుకార్ కమిటీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, దండగేరి దళిత నాయకురాలు అందే మీనా కుమారి తో పాటు అమీలియో హాస్పిటల్స్ సిబ్బంది ,డాక్టర్లు రమాదేవి, ప్రసన్న ,మేనేజర్ వరప్రసాద్, టెక్నీషియన్ కళ్యాణి తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకొని,ఉచితంగా మందులను తీసుకున్నారు.