
సమయపాలన పాటించని బొల్లవరం గ్రామ సచివాలయ సిబ్బంది..!
కల్లూరు, న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో సచివాలయంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 11 గంటలైనా సచివాలయ తలుపులు తెరవడం లేదు. పనుల కోసం వచ్చిన ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయ సర్వేయర్ సచివాలయానికి రాకపోవడం, ఫోన్ చేసినా నిర్లక్ష్య సమాధానాలు చెబుతూ, భూముల సర్వే సమస్యలను పరిష్కరించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉన్నప్పటికీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూమికి సంబంధించిన పత్రాల కోసం వచ్చిన ప్రజలకు సచివాలయ సిబ్బంది మండల కార్యాలయాలకు వెళ్లి పని చేసుకోవాలని సూచిస్తున్నారు. సచివాలయ సిబ్బంది సక్రమంగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి పనులు మానుకొని సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన చిన్న పనులు కూడా సక్రమంగా సిబ్బంది చేయకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయం పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఉదయం 11 గంటలకు వచ్చి సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతున్నారు. అధికారులు స్పందించి సచివాలయం పై పర్యవేక్షణ చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.