అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం
అమరావతి : వైసీపీ హయాంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. 2017లో రూ. 160 కోట్లతో సీఆర్‌డీఏ పనులను ప్రారంభించగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పనులను నిలిపివేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చారని కొనియాడారు. అమరావతి రాజధాని కోసం 5 సంవత్సరాల పాటు నిరంతరం ఆందోళనలు చేపట్టిన రైతులు, మహిళలు, ప్రజలను అభినందించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని లేకుండా అనేక అడ్డంకులు చేసిందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమరావతే రాజధానిగా ఉంటుందని , రెండో మాట లేదని స్పష్టం చేశారు. విశాఖ ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్లు రింగు రోడ్డును నిర్మించబోతున్నామని, రాజధాని ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను నెలకొల్పబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.