
హర్యానా ఫలితాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి, న్యూస్ వెలుగు: హర్యానా లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మంచి విజయాన్ని సాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తే ఏవిధంగా మెజారిటీ వస్తుందో హర్యానా ఒక ఉదాహరణ అని అన్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హర్యానా ఫలితాలపై ప్రధాని మోద కి బుధవారం ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు వివరించారు . హర్యానాలో 90 సీట్లు ఉండగా 48 సీట్లు బీజేపీ గెలిచిందని అన్నారు. 39.94 ఓట్లు వచ్చాయని, గతంలో కంటే మూడుశాతం ఓట్లు పెరిగాయని, బీజేపీ అగ్రనాయకత్వం పనిచేసే విధానం వల్ల హర్యానాలో వరుసగా మూడోసారి గెలిచిందని వెల్లడించారు. గెలిపించిన ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు బీజేపీకి ఓట్లశాతం పెరుగుతుందని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం, సమ్మేళనానికి ఓట్లు వేసి సమయస్ఫూర్తి కనబర్చిన ఓటర్లకు అభినందనలు తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల బీజేపీ బలమైన పార్టీగా అవతరించిందన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ వల్ల ఏకకాలంలో ఎన్నికలు పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమం, సాధికారతవైపు దృష్టిని సారించవచ్చని, దీనికి అందరు మద్దతు తెలుపాలని కోరారు.